- విద్య ప్రమాణాలకు అనుగుణంగా న్యాక్ గ్రేడ్‌లు,
- బంగారం, నగదు, ఫోన్లు ఇచ్చినట్టు ఆరోపణలు
- 14 మందిపై కేసు నమోదుచేసిన సీబీఐ
గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోనికోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదుచేసింది. వర్సిటీకి ‘A++ గుర్తింపు’ పరిశీలనకు వచ్చే న్యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్) తనిఖీ బృందంలో తమకు అనుకూలమైన ప్రొఫెసర్లే సభ్యులుగా ఉండేలా, వారు సానుకూల నివేదిక ఇచ్చేలా వర్సిటీ యాజమాన్యం ముందుగానే సంబంధీకులతో కుమ్మక్కైనట్లు సీబీఐ తేల్చింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, గౌతమ్ బుద్ధనగర్, ఢల్లీి సహా 20 చోట్ల న్యాక్ సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. వారి వద్ద నుంచి రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్ 16ప్రో స్వాధీనం చేసుకుంది. సీబీఐ అరెస్ట్ చేసినవారిలో కేఎల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజ హరీన్, వైస్ ఛాన్సలర్ జీ.పి.సారథి వర్మ, హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ ఉన్నారు. ఈ కేసులో కేఎల్‌యూ యాజమాన్య ప్రతినిధులు, న్యాక్ బృందంలో సభ్యులైన ప్రొఫెసర్లు సహా 10 మందిని అరెస్టు చేసిన సీబీఐ.. వారిని విజయవాడలోని సీబీఐ కోర్టులో హాజరుపర్చింది. న్యాయస్థానం నిందితులకు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులోని ప్రధానాంశాలివి.
ఒక్కో సభ్యుడికి రూ.3 లక్షలు, ఒక ల్యాప్‌ట్యాప్ ఇచ్చేలా అంగీకారం
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కేఎల్‌ఈఎఫ్) ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్స్‌లర్ జీపీ సారథి వర్మలు.. న్యాక్ డైరెక్టర్ ఎం.హనుమంతప్ప, మాజీ ఉప సలహాదారు ఎల్.మంజునాథరావు, సలహాదారు ఎం.ఎస్.శ్యామ్‌సుందర్‌లతో కుమ్మక్కయ్యారు. వారి ద్వారా తమకు అనుకూలమైన వారిని న్యాక్ తనిఖీ బృందంలో సభ్యులుగా చేర్పించుకున్నారు. గత నెల 18, 19 తేదీల్లో హనుమంతప్ప, మంజునాథరావులు విజయవాడ రాగా, వారికి కోనేరు సత్యనారాయణ, జీపీ సారథి వర్మలు రూ.10 లక్షలు లంచంగా ఇచ్చారు. అందులో రూ.5 లక్షలు ఎం.ఎస్.శ్యామ్‌సుందర్ వాటా కాగా, మిగతా రూ.5 లక్షలు హనుమంతప్ప, మంజునాథరావులది.
కేఎల్‌ఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఎ.రామకృష్ణలు గత నెల 25న న్యాక్ తనిఖీ బృందం సభ్య సమన్వయకర్త రాజీవ్ సిజారియాను దిల్లీలో కలవగా.. రూ.1.80 కోట్ల లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చల అనంతరం ఒక్కో సభ్యుడికి రూ.3 లక్షలు, ఒక ల్యాప్‌ట్యాప్, ఛైర్మన్ సమరేంద్రనాథ్ సాహు, రాజీవ్ సిజారియాలకు రూ.10 లక్షలు చొప్పున చెల్లించేలా అంగీకారం కుదిరింది. వివిధ సందర్భాల్లో లంచం సొమ్ము ముట్టజెప్పారు. తనిఖీల కోసం వచ్చిన రాజీవ్ సిజారియా మరో రూ.60 లక్షలు డిమాండు చేయగా.. అంతకుముందు ఇచ్చింది కాకుండా మరో రూ.15 లక్షలు చెల్లించారు. ఛైర్మన్ సమరేంద్రనాథ్ సాహు లంచం సొమ్ములో 75 శాతాన్ని బంగారం రూపంలో ఇవ్వాలని అడగ్గా, అలా మార్చి ఇచ్చారు.
ఆసుపత్రిలో చేరిన కోనేరు సత్యనారాయణ
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ శనివారం రాత్రి అనారోగ్యంతో విజయవాడ సూర్యారావుపేటలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు.