దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ప్రిలిమినరీ కీ (Jee Main 2025 Preliminary Key) విడుదలైంది. జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన పేపర్- 1 ప్రాథమిక ఆన్సర్ కీలు, రెస్పాన్స్ షీట్లను ఎన్‌టీఏ (NTA) తాజాగా విడుదల చేసింది.ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 6వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు తెలపవచ్చని అభ్యర్థులకు సూచించింది. జేఈఈ మెయిన్ (JEE MAIN 2025) పేపర్ 1 ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే.. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున (నాన్ రిఫండబుల్) చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది కీ, ఫలితాలను వెల్లడిస్తారు. ఫిబ్రవరి 12 నాటికి జేఈఈ మెయిన్ (Joint Entrance Examination) ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరి 22 నుంచి 29 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 6వ తేదీ రాత్రి 11.50 గంటల లోపు పంపవచ్చని NTA తెలిపింది. అభ్యర్థులు పూర్తి వివరాలను ఎప్పటికప్పడు jeemain.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.