తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. యువపారిశ్రామికవేత్తను ప్రోత్సహించటమే లక్ష్యంగా టీహబ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హైద్రాబాద్‌ను స్టార్ట్‌అప్ క్యాపిటల్ తీర్చిదిద్దటమే ప్రభుత్వ ప్రధాన ఉద్ధేశ్యం అన్నారు. దేశ భవిష్యత్తుకు, యువతకు టీ హబ్ మార్గదర్శకంగా ఉండబోతోందన్నారు.
ప్రముఖుల ప్రశంసలు :
హైదరాబాద్‌లో టీ హబ్‌పై దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో రతన్ టాటా కూడా నిలిచారు. ఇది భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు భారీ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు ట్విటర్ పోస్ట్‌కు స్పందించిన టాటా టీహబ్‌ను ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణా సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి టాటా అభినందనలు తెలిపారు. ఈయనతోపాటుగా నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్, టాలీవుడ్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు, మహేష్ బాబుతో సహా పలువురు ప్రముఖులు కొత్త టీ-హబ్ పై ప్రశంసలు కురిపించారు.