నందమూరి తారకరత్న కన్నుమూత !

0


మృత్యువుతో పోరాడుతూ నటుడు తారకరత్న ఓడిపోయారు. నందమూరి అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు మరిలిపోయారు. తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. తారకరత్న పార్థీవ దేహాన్ని ఈరోజు రాత్రికి హైదరాబాద్‌ తరలించే అవకాశముంది. జనవరి 27న ‘యువగళం’  పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో ఆయన్ను తొలుత కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

తెలుగు సినీనట దిగ్గజం ఎన్టీఆర్‌ కుమారుడు మోహన్‌కృష్ణ తనయుడే తారకరత్న. 1983 ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో ఆయన జన్మించారు. అలేఖ్య రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులోనే కథానాయకుడిగా తారకరత్న తెరంగేట్రం చేశారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే నటనపై ఉన్న ఆసక్తితో.. 2002లో విడుదలైన ‘ఒకటో నెంబర్‌ కుర్రాడు’తో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా విజయం సాధించడంతో తారకరత్నకు వరుస అవకాశాలు వరించాయి. అలా, ఆయన హీరోగానే కాకుండా విలన్‌, సహాయ నటుడిగానూ నటించి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ‘యువరత్న’, ‘భద్రాద్రి రాముడు’, ‘అమరావతి’, ‘నందీశ్వరుడు’ వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘అమరావతి’ చిత్రానికి గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్నారు.

తారకరత్న మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !