తెలుగుదేశంలో చేరిన కన్నా లక్ష్మినారాయణ

0


మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం మధ్యాహ్నం టీడీపీలో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి కన్నాను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు కన్నాకు అపూర్వ స్వాగతం పలికారు. అలాగే గుంటూరు మాజీ మేయర్‌, కన్నా కుమారుడు నాగరాజు,తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్‌ నిజాముద్దీన్‌ తదితరులు టీడీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్‌ నాయకులు వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అంతకుముందు కన్నా లక్ష్మినారాయణ గుంటూరులోని తన నివాసం నుంచి 3వేల మంది కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తరలి వచ్చారు. కాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న కన్నా... ఇప్పటికే తన అనుయాయులతో సమావేశమై వారిని తనతో పాటు పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

నిత్యం జనం మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కన్నాకు ఏ పార్టీలో ఉన్నా జనాదరణ మెండుగా ఉంటుందని.. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కాపు సామాజికవర్గంలో ఎంతో పట్టుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన చేరికను వారంతా స్వాగతించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.

ఐతే ఇటీవలి కాలంలో కన్నా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కన్నా జనసేనలో చేరుతారని తొలుత కొంత ప్రచారం జరిగినప్పటికీ .. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనలో చేరడం కంటే బీజేపీలోనే కొనసాగవచ్చని.. దానికీ దీనికీ పెద్దగా తేడా ఉండదని అనుకున్నారు. ఈ క్రమంలోనే కన్నా అభీష్టానికి.. ఆయన సీనియార్టీకి తగిన గౌరవం ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చిందనే ప్రచారమూ లేకపోలేదు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పార్టీ దూతగా వెళ్ళి.. కన్నా లక్ష్మీనారాయణను భేటీ అయ్యారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ లోకి ఆహ్వానించారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో గత పదేళ్లుగా కన్నా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరి టీడీపీలో చేరికతో కన్నా రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతోందనేది రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !