సూపర్‌స్టార్ రజనీకాంత్ విజయవాడ చేరుకున్నారు. దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఇక ఎయిర్ పోర్ట్‌లో బాలకృష్ణ, రజనీకాంత్‌లు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రజనీకాంత్‌ను తేనెటి విందుకు ఆహ్వానించారు. ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సూపర్ స్టార్ రానున్నారు. తేనేటి విందు అనంతరం అక్కడి నుంచి రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ చంద్రబాబు కుటుంబసభ్యులు అందరూ కలిసి సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభకు హాజరుకానున్నారు.
ఈ వేడుకల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. ఈ సభలో చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. గతంలో 2004 కృష్ణానది పుష్కరాల సందర్భంలో కృష్ణాజిల్లాకు వచ్చిన రజినీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై శుక్రవారం రెండు పుస్తకాలు విడుదల చేయనున్నారు.