తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్‌గా తిరుమతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఉదయం 11.44 గంటలకు ఆలయంలో చైర్మన్‌గా ప్రయాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ధనవంతులకు ఊడిగం చెయ్యడానికో, వారికి ప్రాధాన్యత ఇవ్వడానికో ఈ పదవి చెప్పట్టలేదని కరుణాకర్ రెడ్డి చెప్పారు. హిందూధార్మికతను పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.
ఎక్కువ సమయం దర్శించుకోవటం సమంజసం కాదు.
దేవుడిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడం కాదు.. స్వామి భక్తుడిని అనుగ్రహించే క్షణకాల దర్శనం లభిస్తే చాలని అన్నారు. టీటీడీ చైర్మన్‌గా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్న.. ఎక్కువ సమయం స్వామివారిని దర్శించుకోవాలన్న కోరిక సమంజసం కాదని అన్నారు. కోట్లాది మంది టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తూ వుంటే.. సామాన్య భక్తుడినైన నన్ను స్వామివారు అనుగ్రహించారని కరుణాకర్ రెడ్డి అన్నారు. నాలుగు సంవత్సరాలు పాలకమండలి సభ్యుడిగా వున్నానని, నాలుగు సార్లు కూడా వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్లలేదని చెప్పారు. సామాన్య భక్తుడిలాగే స్వామివారిని మహాలఘు విధానంలో అనేకసార్లు దర్శించుకున్నానని అన్నారు. జగన్ మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పాలకమండలి అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణం చేసే ఆదృష్టం దక్కిందని కరుణాకర్ రెడ్డి అన్నారు.
నేను ధనవంతులను దర్శనాలు చేయించడానికి అధ్యక్షుడుని కాలేదు. సామాన్యుల వైపు, ఉద్యోగుల వైపు వుంటానని చెప్పారు. ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని అన్నారు. ఇదిలాఉంటే ఉదయం 9గంటలకు పద్మావతిపురంలోని ఇంటి వద్ద నుంచి బయలుదేరిన భూమన గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలిపిరి వద్ద గోపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. టీటీడీ అధికారులు భూమనకు ఘనస్వాగతం పలికారు. భూమన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తిరుపతి నగరంలో అభిమానులు భారీ ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.