2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు కోసమో, తన అభివృద్ది కోసమో పొత్తులు కాదని.. రాష్ట్ర అభివృద్ది కోసమే పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ప్రకటించింది. అయితే అప్పట్లో నేరుగా పోటీ చేయకపోయినా కొత్తగా పార్టీ పెట్టడంతో పవన్ చరిష్మా టీడీపీకి చాలా లాభం చేకూర్చింది. బీజేపీ కూడా పొత్తులో ఉండటంతో రెండు పార్టీల మధ్యే సీట్ల పంపకాలు జరిగాయి. కానీ, వచ్చే ఎన్నికల్లో పొత్తుల ప్రకటన కంటే ముందు నుంచే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ద్వారా పార్టీ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. పొత్తుల విషయం ఎన్నికల సమయంలో చూసుకుందామని చెప్పుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పొత్తులపై ప్రకటన చేసారు. అయితే చంద్రబాబు ఊహించని విధంగా జైలుకు వెళ్లిపోవడంతో పొత్తులపై రెండు పార్టీల్లో ముందస్తు చర్చ లేకుండానే ప్రకటన వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ ఏకపక్షంగా చేసిన ప్రకటన.. జనసేన కంటే టీడీపీకే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొంది. పార్టీ పరిస్థితి ఏంటి అని కేడర్ అంతా అయోమయంలో పడిన సందర్భంలో ఒక్కసారిగా పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన టీడీపీ నాయకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. పొత్తులపై క్లారిటీ రావడంతో ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చ మొదలైంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుంది అని తెలుగు తమ్ముళ్లు లెక్కలేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా ఎన్ని చోట్ల సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందో అని తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు
వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జీల నియామకం జరగలేదు. ఇప్పుడిప్పుడే ఇబ్బందికరంగా ఉన్న స్థానాలకు ఇంచార్జీలను ఎంపిక చేస్తూ బాధ్యతలు అప్పగించే పనిలో పడ్డారు చంద్రబాబు. వచ్చే దసరా నాటికి మేనిఫెస్టో విడుదలతో పాటు మొదటి విడత అభ్యర్ధులను ప్రకటించాలనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాలతో వీటన్నింటికి బ్రేక్ పడిరది. దీంతో సీట్లకు సంబంధించి ఇప్పుడు పార్టీలో చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు వల్ల ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. ఎక్కడెక్కడ జనసేనతో సీట్ల సర్ధుబాటు ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే జిల్లాల వారీగా గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా గెలుపోటములను శాసించే స్థాయిలో జనసేన పార్టీ ఉంది. దీంతో నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలతో పాటు వైసీపీ అభ్యర్ధుల మీద ఉన్న వ్యతిరేకత ఆధారంగా సీట్లను అంచనా వేసుకుంటున్నారు పార్టీ నేతలు. చంద్రబాబు అరెస్ట్‌కు ముందు వరకూ రెండు పార్టీలు కలిస్తే జనసేనకు గరిష్టంగా 25 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. తెలుగుదేశం పార్టీకి పవన్ మద్దుతు తప్పనిసరి కావడంతో ఈసారి ఎక్కువగానే సీట్లను ఆశిస్తారనే చర్చ జరుగుతుంది. అయినప్పటికీ గెలిచే స్థానాల్లో ఎక్కువ సీట్లు ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 40 సీట్ల వరకూ జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తుంటం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
కీలక స్థానాల్లో మారనున్న సమీకరణాలు
తెలుగుదేశం పార్టీ-జనసేన పొత్తుతో చాలా నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీచేసాయి. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన మద్దతు లేకపోవడంతో ఆయా స్థానాల్లో టీడీపీ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. అలాంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వచ్చిన ఓట్లను టీడీపీ-జనసేన ఓట్లను కలిపి పోల్చుకుంటున్నారు. అలా చూస్తే చాలా స్థానాల్లో టీడీపీకి మంచి మెజార్టీ వచ్చిందని చెప్పుకొస్తున్నారు. దీంతో ఈసారి కలిసి పోటీ చేయడం ద్వారా చాలా స్థానాల్లో టీడీపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇక టీడీపీ బలహీనంగా ఉన్న స్థానాల్లో జనసేనకు సీటు ఇస్తే గెలిచే అవకాశాలున్న స్థానాలు కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు జనసేనకు ఇచ్చేలా టీడీపీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి పొత్తుల ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అయితే, ఇప్పటికే టిక్కెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న స్థానాల్లో అభ్యర్ధులు తారుమారయితే స్థానికంగా ఎలాంటి ఫలితాలు వస్తాయనేది కూడా లెక్కలు వేస్తున్నారు. రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీ వేసిన తర్వాత సీట్లు, అభ్యర్ధుల విషయంలో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.