హైదరాబాద్ శివారు తుర్కయాంజల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొద్ది నెలల క్రితమే కాలేజీలో చేరిన 16 ఏళ్ల యువకుడు తన రూమ్‌మేట్‌కి ఉరివేసుకుని కనిపించడంతో హాస్టల్ వార్డెన్‌కి, కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించాడు. రూమ్‌మేట్ కనిపించకపోవటంతో వెళ్ళి రూమ్‌లో వెతగ్గా తాను నివాసం ఉండే గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సిబ్బంది అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, అతని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు యువకుడు చదువులో రాణిస్తున్నాడని పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. యాజమాన్యం వేధింపులే విద్యార్థి ఆత్మహత్యకు కారణమని ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలానికి ఆదిభట్ల సీఐ రఘువీర్ రెడ్డి చేరుకుని విచారణ చేపట్టారు. సాధ్యమైన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.