KESINENI BROTHERS : కేశినేని నానికి చంద్రబాబు చెక్‌.. అసలేం జరిగింది?

0

బెజవాడ బ్రదర్స్‌ వివాదంపై క్లారిటీకి వచ్చింది టీడీపీ. రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నానికి షాక్‌ ఇస్తూ తమ్ముడు కేశినేని చిన్నికి లైన్‌ క్లియర్‌ చేసింది. ఏపీ పాలిటిక్స్‌ లో హాట్‌ టాపిక్‌ అయిన ఈ ఎపిసోడ్‌లో బ్యాగ్రౌండ్‌ స్టోరీ ఏంటి? సిట్టింగ్‌ ఎంపీని పక్కన పెట్టేయటానికి టీడీపీ ఎందుకు సిద్ధపడిరది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదర్చకుండా ఒక్కరినే వెనకేసుకు రావడానికి కారణాలు ఏంటి?

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం..

బెజవాడ బ్రదర్స్‌ పంచాయితీని ముగించింది టీడీపీ. పార్టీ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనట్లు ముగ్గురు దూతలను పంపి సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నానిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని తేల్చి చెప్పింది. రెండో కంటికి తెలియకుండా పార్టీ ఎంపీకి వర్తమానం పంపితే ఆయనేమో ఏకంగా సామాజిక మాధ్యమాలలో ఆ విషయాన్ని పెట్టి పార్టీలో అంతర్గత కుమ్ములాటపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఇచ్చిన షాక్‌ తో ఎంపీ కేశినేని నాని భవిష్యత్తుపై రకరకాల చర్చ మొదలైంది.

సొంత సోదరుడితోనే పోటీ..

2014 నుంచి విజయవాడ ఎంపీగా కొనసాగుతున్న కేశినేని శ్రీనివాస్‌ అలియాస్‌ నాని గతకొంత కాలంగా సొంత సోదరుడు కేశినేని చిన్నితోనే(కేశినేని శివనాధ్‌) పోటీ ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న నాని తమ్ముడు చిన్ని.. టీడీపీలో చాలా యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్నారు. సొంతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ  దూసుకుపోతున్నారు. విజయవాడ నగరంలో ఉన్న ప్రముఖుల మద్దతు కూడా చిన్నికే ఉండటం, యువనేత నారా లోకేశ్‌ అండదండలు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో చిన్నికే టికెట్‌ ఖరారయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా..

ఈ ప్రచారానికి తగ్గట్లే ఎంపీ కేశినేని నాని చాలాకాలంగా పార్టీలో ఉండే లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్క అధినేత చంద్రబాబు విషయం తప్పిస్తే మిగతా ఏ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. పార్టీ రాష్ట్ర కార్యక్రమానికి హాజరు కావడం లేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే సమావేశాలకు కూడా డుమ్మా కొట్టే వారు నాని. ఏమంటే.. ఏవేవో కారణాలు చెప్పేవారు.

సరిగ్గా ఎన్నికలకు ముందు షాక్‌..

నాని వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న హైకమాండ్‌ ఇన్నాళ్లూ వేచి చూసి సరిగ్గా ఎన్నికల ముందు షాక్‌ ఇచ్చింది. పార్టీతో గ్యాప్‌ మెయింటేన్‌ చేయడం, ఆర్థికంగా ఎన్నికల ఖర్చులు తట్టుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో ఎంపీ నానికి బదులుగా ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

కొట్టుకున్న ఇరువర్గాలు.. చంద్రబాబు సీరియస్‌

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేసింది. విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువూరూలోనూ భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది. సభా వేదిక, జనసమీకరణ వంటి వాటిపై ఎంపీ కేశినేని నాని తిరువూరు వెళితే అక్కడ చిన్ని వర్గం నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఇరువర్గాలు బాహాబాహీకి దిగడం, ఫ్లెక్సీలు చింపుకోవడం, దాడులకు దిగి రచ్చరచ్చ చేశారు. దీన్ని సీరియస్‌ గా పరిగణించిన పార్టీ అధినేత చంద్రబాబు.. సీనియర్‌ నేతలను రంగంలోకి దింపి తిరువూరు సభ ఏర్పాట్ల నుంచి తప్పుకోవాల్సిందిగా ఎంపీ నానికి వర్తమానం పంపారు.

పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు..

టీడీపీ సంప్రదాయంలో గతంలో ఎప్పుడూ ఇంత సీరియస్‌ గా యాక్షన్‌ తీసుకోని చంద్రబాబు.. కేశినేని నాని విషయంలో కఠినంగా వ్యవహరించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. తిరువూరు సభ ఏర్పాట్లలో జరిగిన గలాటా ఒక్కటే నానిపై చర్యలకు కారణం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ నాని రెండోసారి గెలిచినప్పటి నుంచి పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపేవారు. కొన్నిసార్లు తనవరకు తానే హైకమాండ్‌, తనను ఎవరూ డిక్టేట్‌ చెయ్యలేరు అన్నట్లు హాట్‌ కామెంట్స్‌ చేసేవారు. ఇక పార్టీ కార్యక్రమాలకు వెళ్లేంత తీరిక లేదని చెప్పేవారు. ఇక యువనేత లోకేశ్‌ అంటే మరీ లైట్‌ తీసుకునే వారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లోకేశ్‌ యువగళం పాదయాత్రకు కూడా హాజరుకాలేదు ఎంపీ నాని. రాష్ట్రవ్యాప్తంగా కేడర్‌ సంబరంగా జరుపుకున్న పాదయాత్రలో నాని కనీసం ఫ్లెక్సీ కూడా పెట్టలేదు.

ఎంతో ఆలోచన చేశాకే చంద్రబాబు సంచలనం..

ఇక చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో మాత్రం లోకేశ్‌తో కలిసి ఢల్లీిలో కొన్ని పనులు చక్కబెట్టారు నాని. దీంతో మళ్లీ ఆయన పార్టీ పెద్దలతో సఖ్యత కోరుకుంటున్నట్లు కనిపించింది. కానీ, చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్‌ తో గతమంతా ఇప్పుడు కళ్లముందు కదలాడుతున్నట్లు అవుతుందని అంటున్నారు టీడీపీ నేతలు. తిరువూరు సభ ఏర్పాట్లకు దూరంగా ఉండమని మాత్రమే చెప్పకుండా ఏకంగా వచ్చే ఎన్నికల్లో వేరే వ్యక్తిని లోక్‌ సభ బరిలో దింపనున్నట్లు సంకేతాలు పంపడం చర్చనీయాంశంగా మారింది. రెండుసార్లు గెలిచిన ఎంపీని పక్కన పెట్టే విషయంలో చంద్రబాబు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు అంటున్నారు .

దెబ్బకొట్టిన ఆర్థిక ఇబ్బందులు..

ముఖ్యంగా నాని ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేకపోవడం కూడా ఆయనను పక్కకు పెట్టేందుకు ఒక కారణం అని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. పార్టీ తనను పక్కకు తప్పుకోమని చెప్పింది అనే విషయాన్ని ఎంపీ స్వయంగా తెలియజేయడంతో ఇప్పుడు టీడీపీలో నాని పాత్ర ఏంటన్నదే ఆసక్తికరంగా మారింది. ఆయన రాజీనామా చేస్తారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీపై గుర్రుగా ఉన్న నాని.. బీజేపీ నుంచి పోటీ చేస్తారనే అంచనా వేస్తున్నారు పరిశీలకులు. అంతేకాకుండా తన అనుచరులను బెజవాడ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అయితే, నాని బీజేపీకి వెళ్లే పరిస్థితి లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నాని బీజేపీలోకి వెళ్లకపోవచ్చునని అంటున్నారు.

ఇక తన భవిష్యత్‌ కార్యాచరణ ఫిబ్రవరిలో ఉంటుందని, మీడియాకు కావాల్సిన మసాల ఇస్తానని చెబుతున్న నాని.. వచ్చే నెల సంచలన నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి బెజవాడ బ్రదర్స్‌ లొల్లికి చంద్రబాబు స్టైల్‌ లో ముగింపు పలకడం సరికొత్త రాజకీయంగా  పరిశీలకులు చెబుతున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !