HMDA అధికారుల కీలక పాత్ర
ఇదిలా
ఉంటే.. వేలంపాట సమయంలోనే కాకుండా.. ఆ తర్వాత కూడా హెచ్‌ఎండీఏలో తన పరిచయాల
ద్వారా శివ బాలకృష్ణ ఈ తతంగాన్ని నడిపించినట్లు గుర్తించారు . భూములు
వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలను హెచ్‌ఎండీలో పని చేసిన అధికారులు
రియల్టర్లకు చేర్చారు. అంతేకాదు ధరలను నిర్ణయించడంలోనూ వీళ్లే కీలక పాత్ర
పోషించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అధికారుల పాత్రపైనా ఏసీబీ లోతైన
దర్యాప్తు చేపట్టింది. ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాన్వేషణలో.. గత
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల్ని వేలం వేయడం ప్రారంభించిన సంగతి
తెలిసిందే. అధికారం అండతో.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమాస్తులు
కూడబెట్టుకున్నాడు శివబాలకృష్ణ. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఏసీబీకి అతను
ఆస్తులు కూడబెట్టిన తీరు ఏసీబీని సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
ఇంట్లోవాళ్లు, బంధువులు, ఆఖరికి పనివాళ్ల పేరిట మీద కూడా బినామీ ఆస్తుల్ని
కూడబెట్టాడతను. దీంతో బినామీలను అరెస్ట్ చేసి ఈ పాటికే విచారణ చేపట్టిన
ఏసీబీ.. ఇవాళో, రేపో కీలక అరెస్టులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కోకాపేట్‌లో భూమాయ !
జూలై 16, 2021లో NEOPOLIS పేరుతో HMDA భూముల అమ్మకం ద్వారా 2000 కోట్లు సమకూర్చుకుంది. ఆ భూముల్లో ఎకరం 42.2 కోట్లు అత్యధికంగా పలికింది. ఈ భూములన్నీ అప్పటి ప్రభుత్వం సొంత వారికి,అనుయాయులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండేళ్ళలోపే ఆగష్టు 3, 2023 నాటికి నియోపోలీస్‌లో భూములు దక్కించుకున్న రాజ్‌పుష్ప ప్రాపర్టీస్ ప్రై.లి. రూ. 100.75 కోట్లుకు దక్కించుకుంది. కోకాపేట చుట్టుప్రక్కల ఉన్న భూములను తక్కువ ధరకు దక్కించుకుని హెచ్‌ఎండిఏ ద్వారా ప్రభుత్వ భూముల ధర రేటు పెంచటమే వారి ఉద్ధేశ్యంగా కనిపిస్తోంది. తక్కువ ధరకు కొన్న భూములను ఎక్కువ ధరకు అమ్ముకుంటూ భారీగా లాభాపడేలా ప్రభుత్వ పెద్దలు సహాకరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రత్యేకంగా కోకాపేట భూములపై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి ఆదాయం పేరుతో భూముల వేలాన్ని నిర్వహించగా వాటిని ఈ ఆక్షన్ పేరుతో అన్ని వ్యవహరాలు చక్కగా నడిపించారు. తెరవెనుక అనుయాయులకు, కావలసిన వారికి కేటాయింపులు జరుపుకున్నారు. అధికారికంగా కేటాయింపులు జరిపారు. కానీ ఈ కేటాయింపుల వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరానికి రూ.25 కోట్లు కాగా, 42.2 కోట్లకు ఈ ఆక్షన్‌లో అత్యధిక బిడ్ దాఖలు చేసినట్లు చూపి వారికే భూకేటాయింపులు జరిగినట్లు చేశారు. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఎకరం 40 కోట్ల భూమిని 100 కోట్లుకు చేర్చటం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు తెరవెనుక ఉండి నడిపినట్లు తెలుస్తోంది.