Bhairavakona Movie Review : ఊరు పేరు భైరవకోన సినిమా రివ్యూ !

0

సందీప్‌కిషన్‌కు సరైన విజయం దక్కి చాలా కాలమైంది. అలాగని ప్రయోగాలు చేయడంలో తనేం వెనకడుగేయడం లేదు. కాకపోతే ఇంత వరకూ ఏదీ మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కించలేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి విజయమే లక్ష్యంగా ‘ఊరి పేరు భైరవకోన’ అనే సోషియో ఫాంటసీ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలు అందరి దృష్టినీ ఆకర్షించడంతో ఈ సినిమాపై చక్కటి అంచనాలేర్పడ్డాయి. మరి ఈ ‘భైరవ కోన..’ కథేంటి? అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచిచ్చింది? సందీప్‌కు విజయాన్ని అందించిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథేంటంటే

భైరవకోన ఓ మార్మిక ప్రపంచం. ఏడాదిలో వచ్చే కార్తీక మాసంలో రాత్రి వేళ మాత్రమే ఆ ఊరి తలుపులు తెరచుకుంటుంటాయి. అందులోకి ప్రవేశించిన వాళ్లే తప్ప.. ప్రాణాలతో బయటకొచ్చిన వాళ్లు ఎవరూ ఉండరు. సినిమాల్లో హీరోలకు డూప్‌గా యాక్షన్‌ సీన్స్‌ చేసే బసవ ఓ పెళ్లి ఇంట్లో దొంగతనం చేసి అక్కడ బంగారు నగలు కొట్టేసి తప్పించుకొని పారిపోతాడు. బసవతో పాటు జాన్‌(వైవా హర్ష) తప్పించుకొని వెళ్తుంటే దారిలో గీత(కావ్య థాపర్‌) అనే దొంగ యాక్సిడెంట్‌ లాగా నాటకం ఆడటంతో, తనని కాపాడటానికి వీళ్ళ బండి ఎక్కించుకుంటారు. పోలీసులు వీళ్ళని ఛేజ్‌ చేయడంతో అనుకోకుండా భైరవకోన అనే ఊర్లోకి వెళ్తారు. అక్కడ వీరికి అనుకోని వింత అనుభవాలు ఎదురవ్వడం, బసవ.. భూమి(వర్ష)ని ప్రేమించి, ఆమె కోసమే ఈ దొంగతనం చేయడం ఇవన్నీ పెద్దమ్మ(వడివుక్కరాసి) అనే ఆవిడ చెప్పడంతో ఆశ్చర్యపోతారు. తాను దొంగతనం చేసిన నగలు, అక్కడి వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళని ఎదుర్కొని ఆ నగలు తెచ్చుకుందాం అనుకునేలోపు అసలు అది ఊరు కాదని, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళంతా దయ్యాలు అని తెలుస్తుంది, ఉదయం అవ్వడంతో ఆ దయ్యాలన్నీ మళ్ళీ గాలిలో కలిసిపోతాయి. ఆ ఊర్లో ఒక్కరు కూడా కనపడరు. కానీ ఆ నగలు తీసుకొనే వెళ్ళాలి, డబ్బులు అవసరం అని బసవ ఉండాలనుకుంటాడు అక్కడే. మరి ఆ తర్వాత ఏమైంది? భైరవకోనలో బసవకు ఎలాంటి పరిస్థితులెదురయ్యాయి? అసలు ఆ కోన కథేంటి? దానికి గరుడపురాణంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలకు ఉన్న లింకేంటి? స్టంట్‌మ్యాన్‌ బసవ తనకు అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ) కోసం దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది? భైరవకోన నుంచి బసవ గ్యాంగ్‌ ప్రాణాలతో బయటపడిరదా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా సాగిందంటే

ప్రేమించిన అమ్మాయి లక్ష్యాన్ని నేరవేర్చడం కోసం కథానాయకుడు చేసిన ఓ సాహసోపేతమైన ప్రయాణమే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. మొదటి హాఫ్‌ అంతా హీరో దొంగతనం, హీరో ప్రేమ ఫ్లాష్‌ బ్యాక్‌, ముగ్గురు భైరవకోనలోకి ఎంటర్‌ అవ్వడంతో సాగుతుంది. అక్కడక్కడా కామెడీతో, థ్రిల్లింగ్‌ గా ఫస్ట్‌ హాఫ్‌ సాగుతుంది. ఇంటర్వెల్‌ టైంకి ఆ ఊళ్ళో అంతా దయ్యాలు అని చెప్పి షాక్‌ ఇస్తారు. దీంతో సెకండ్‌ హాఫ్‌ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్‌ హాఫ్‌ మొదట్లో ఫుల్‌ కామెడీతో నవ్వించినా తర్వాత సీరియస్‌ ఎమోషన్‌ తో నడిపించారు. దీన్ని భైరవకోన అనే ఓ ఊహా ప్రపంచంలో సెట్‌ చేసి.. దానికి గరుడ పురాణంతో ముడిపెట్టి ఆసక్తిరేకెత్తించేలా చేశారు దర్శకుడు వి.ఐ.ఆనంద్‌. అయితే తెరపై చూస్తున్నప్పుడు ఆ ప్రపంచం.. అందులోని పాత్రలు ఏవీ ఆసక్తికరంగా.. సహజంగా కనిపించవు. ఈ కథలో పలు కోణాలు కనిపిస్తాయి. అలాగే చాలా మలుపులు ఉంటాయి. కానీ, ఏవీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా కనిపించవు. భైరవకోన పరిచయ సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగానే ఆరంభమవుతుంది. బసవ పెళ్లి ఇంట్లో నగలు దొంగతనం చేసి.. ఒంటికి నిప్పంటించుకొని ఆ ఇంటి నుంచి బయటపడటం.. ఈ క్రమంలో పోలీసులు అతన్ని వెంబడిరచడం.. ఇలా కథ కాస్త వేగంగానే ముందుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. కాకపోతే ఆ వేగానికి బ్రేకులు వేసినట్లుగా అకస్మాత్తుగా బసవ గతం తెరపైకి వస్తుంది. భూమి బ్యాగ్‌ను ఓ బ్యాచ్‌ కొట్టేయడం.. వాళ్లను వెంబడిస్తున్న క్రమంలో ఆమెకు బసవ తారసపడటం.. ఆమెతో కలిసి తను ఆ దొంగల వెంటపడటం.. అదే సమయంలో ఓ పాట.. ఇలా సినిమా నెమ్మదిగా సాగుతుంది. ఈ ఎపిసోడ్‌ ముగిసి కథ మళ్లీ వర్తమానంలోకి వచ్చాకే సినిమాలో కదలిక కనిపిస్తుంది. బసవ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తన కారుతో పాటుగా భైరవకోనలోకి ప్రవ్ఱేశించడం.. ఈ క్రమంలో అక్కడ తనకు ఎదురయ్యే అనుభవాలు మొదట్లో కాస్త ఉత్సుకతను కలిగించేలాగే ఉంటాయి. కానీ, కథలో ముందుకెళ్లే కొద్దీ ఏదో థ్రిల్‌ను రుచి చూడనున్నామని అనుకున్న ప్రతిసారీ ఆశాభంగమే కలుగుతుంది. ఇక విరామానికి ముందు రాజప్ప కోటలో బసవకు ఎదురయ్యే భయానక అనుభవం.. అదే సమయంలో భైరవకోన వెనకున్న ట్విస్ట్‌ను బయటపెట్టిన తీరు థ్రిల్‌ చేస్తాయి. గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలకు భైరవకోనకూ ఉన్న లింకేంటన్నది చూపిస్తూ ద్వితీయార్ధం మొదలవుతుంది. కానీ, అది ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోదు. బసవ - భూమిల లవ్‌ట్రాక్‌లో పెద్దగా బలం కనిపించదు. ఇక దెయ్యాల దగ్గరున్న తన నగల్ని తిరిగి కొట్టేయడం కోసం బసవ ఆడే డ్రామా మరీ ఆసక్తిరేకెత్తించకున్నా కాసేపు నవ్వులు పంచుతుంది. ఇక భూమి చావుకు వెనకున్న కారణం.. దాన్ని బయట పెట్టిన తీరు బాగున్నాయి. పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే

బసవ పాత్రలో సందీప్‌ చక్కగా ఒదిగిపోయాడు. నటుడిగా తనలోని కొత్త కోణాన్ని చూపించేంత స్కోప్‌ దీంట్లో ఏమీ లేదు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ను తనదైన అనుభవంతో తేలికగా చేసుకెళ్లిపోయాడు. భూమి పాత్రలో వర్షను చూపించిన తీరు.. ఆమె కనబరిచిన నటన ఆకట్టుకుంటాయి. కావ్య పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. రాజప్ప పాత్రలో రవిశంకర్‌ కనిపించిన తీరు.. ఆయన నటన ఆకట్టుకుంటాయి. కానీ, దీంట్లో ఆ పాత్ర బలవంతంగా ఇరికించినట్లే ఉంటుంది. వెన్నెల కిషోర్‌, హర్ష పాత్రలు కనిపించిన ప్రతిసారీ నవ్వులు పంచే ప్రయత్నం చేశాయి. పెద్దమ్మగా వడివుక్కరసు పాత్రను భారీ బిల్డప్‌తో పరిచయం చేశారు కానీ, అదే టెంపోను ఆద్యంతం కొనసాగించలేకపోయారు. దర్శకుడు ఆనంద్‌ ఎంచుకున్న కథలో సరైన బలం లేదు. అలాగే భైరవకోన ప్రపంచం.. దాంట్లోని పాత్రలు.. దాని చుట్టూ అల్లుకున్న కథ చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. ఇక నాయకానాయికల ప్రేమకథలోనూ పెద్దగా ఫీల్‌ కనిపించలేదు. శేఖర్‌ చంద్ర సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ‘నిజమే నే చెబుతున్నా’, ‘హమ్మ హమ్మ’ పాటలు తెరపైనా అలరిస్తాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇప్పుడున్న ప్రమాణాలతో పోల్చితే కాస్త తక్కువే. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !