ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్తపాలసీ రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో.. గనులశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. తమిళనాడు, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న ఇసుక విధానం అవినీతికి అడ్డాగా మారిందని.. తవ్వకాలు, రవాణాలో అడుగడుగునా అక్రమాలు జరగుతున్నాయని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. సుమారు 25 శాతం ఇసుక అక్రమంగా తరలిపోతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‌లు, డంప్‌లు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందన్న సీఎం రేవంత్.. మైనింగ్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పేర్కొన్నారు. కొందరు అక్రమార్కులతో అధికారులు చేతులు కలిపి అక్రమ దందాలకు తెర లేపినట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విషయంలో 48 గంటల్లో అధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ఏసీబీ అధికారులతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి టీఎస్‌ఎండీసీలో అక్రమాలను అరికట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధ్యులు ఎంతటి వారైనా.. వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.మరోవైపు.. ఇసుక అమ్మకాలకు సంబంధించి కొత్త పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోకి ఇసుక పాలసీలపై అధ్యయనం చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.