Bharat Ratna : తెలుగు ఠీవి...పి.వి. నరసింహారావుకు భారతరత్న.

0

  • చౌదరి చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌కి కూడా.
  • ట్విట్టర్‌ ద్వారా ప్రధాని ప్రకటన.

కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘భారతరత్న’ పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు , చరణ్‌ సింగ్‌ , ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్‌ ( ట్విటర్‌)’ వేదికగా వెల్లడిరచారు. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం ఐదుగురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌కు ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏకైక తెలుగు ప్రధాని పీవీ..

‘‘రాజనీతిజ్ఞుడుగా, విశిష్ట పండితుడిగా పీవీ నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా , ప్రధానిగా ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయం. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసింది. పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్‌ ఆకర్షించింది. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యా రంగంలో ఆయన అందించిన సహకారం.. దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసింది’’ అని ప్రధాని మోదీ కొనియాడారు. పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్‌ 28న వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్‌పుర్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1991లోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకున్న పీవీ.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకోవాల్సి వచ్చింది. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా ఉన్న ఆయన.. ఆ పదవి చేపట్టిన తొలి దక్షిణాది, ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సాధించారు. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్‌ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. 1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 5లక్షల మెజార్టీతో విజయం సాధించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు.  ప్రధానిగా తన హయాంలో పీవీ అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయనకు సంగీతం, సినిమా, నాటకాలంటే అమితాసక్తి. భారతీయ ఫిలాసఫీ, సంస్కృతి, రచనా వ్యాసాంగం, రాజకీయ వ్యాఖ్యానం, భాషలు నేర్చుకోవడం, తెలుగు, హిందీలో కవితలు రాయడం, సాహిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. తెలుగులో సుప్రసిద్ధ నవల ‘వేయిపడగల’ను ఆయన ‘సహస్రఫణ్‌’ పేరుతో హిందీలోకి అనువదించారు. పీవీ 14 భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

ప్రధానిగా 23 రోజులు..చౌదరి చరణ్‌సింగ్‌

‘‘దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టం. దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన తన జీవితమంతా రైతుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం అంకితమయ్యారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయినా, దేశానికి ప్రధానమంత్రి, హోంమంత్రి అయినా దేశ నిర్మాణానికి ఊతమిచ్చారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా గట్టిగా నిలబడ్డారు. మన రైతు సోదర సోదరీమణుల పట్ల ఆయనకున్న అంకితభావం, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకం..’’ అంటూ మోదీ రాశారు. చౌధరీ చరణ్‌ సింగ్‌.. డిసెంబర్‌ 23, 1903లో ఉత్తరప్రదేశ్‌లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెట్టారు. మొదట ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (%Iచీజ%) తరఫున చురుగ్గా వ్యవహరించిన ఆయన.. 1967లో భారతీయ క్రాంతి దళ్‌ పేరిట సొంతంగా పార్టీని స్థాపించారు. జనతా పార్టీ, జనతా పార్టీ (సెక్యులర్‌)లో పనిచేసి, 1980లో లోక్‌దళ్‌ పేరిట మరోసారి సొంతంగా పార్టీని స్థాపించారు. 1967-68, 1970లో రెండు దఫాలు యూపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమర్జెన్సీ రోజుల్లో జైలు పాలయ్యారు. మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో హోంశాఖ బాధ్యతలు చూశారు. అలాగే ఆయన హయాంలోనే 1979 జనవరి నుంచి జులై వరకు డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రి పనిచేశారు. ఆ వెంటనే 1979 జులై 28 నుంచి ఆగస్టు 20 మధ్య కేవలం 23 రోజుల పాటు దేశ ఐదో ప్రధానిగా సేవలు అందించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. గ్రామాల ఆర్థిక స్థితిగతులకు హాని కలిగించే, రైతులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ఆయనకు ఆరుగురు సంతానం. ఆయన కుమారుడు అజిత్‌ సింగ్‌.. రాష్ట్రీయ లోక్‌దళ్‌ వ్యవస్థాపకుడు.

హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌.

‘‘వ్యవసాయం, రైతుల సంక్షేమంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం డాక్టర్‌ యం.ఎస్‌. స్వామినాథన్‌ కి భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. భారతదేశం వ్యవసాయంలో సవాలుగా ఉన్న సమయంలో.. స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. మేము అతని అమూల్యమైన పనిని ఆవిష్కర్తగా, మార్గదర్శకుడిగా గుర్తించాము. అనేక మంది విద్యార్థులలో అభ్యాసం, పరిశోధనలను ప్రోత్సహిస్తున్నాము. డాక్టర్‌ స్వామినాథన్‌ దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా భారత ఆహార భద్రత, శ్రేయస్సుకు హామీ ఇచ్చింది. ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి, నేను అతని మార్గదర్శకాలను ఎల్లప్పుడూ విలువనిస్తాను..’’ అంటూ మోడీ ట్వీట్‌ చేశారు. స్వామినాథన్‌ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే సాంబశివన్‌ సర్జన్‌. మెట్రిక్యులేషన్‌ పూర్తయిన తర్వాత స్వామినాథన్‌ కూడా తండ్రి బాటలోనే మెడికల్‌ స్కూల్లో చేరారు. కానీ, 1943లో బెంగాల్‌ కరవును కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం నుంచి తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు. భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో స్వామినాథన్‌ విశేష కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !