Eagle Movie Review : రవితేజ ‘ఈగల్‌’ రివ్యూ

0

  

రవితేజ కథానాయకుడిగా, కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడిగా ‘ఈగల్‌’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి రావల్సిన ‘ఈగల్‌’ కాస్త ఆలస్యంగా మంచి ప్రచార హంగామా మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్దగా పోటీ లేకుండా బాక్సాఫీస్‌ ముందుకొచ్చాడు రవితేజ. రవితేజ ఇంతకు ముందు చేసిన సినిమా ‘టైగర్‌ నాగేశ్వర రావు’ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఛాయాగ్రాహకుడిగా వుండి దర్శకుడిగా మారిన కార్తీక్‌ ఘట్టమనేనితో చేతులు కలిపి ఈ ‘ఈగల్‌’ చేశారు. దీనికి పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్‌ నిర్మాత. రవితేజ కెరీర్‌లో ఈ సినిమా కూడా పెద్ద బడ్జెట్‌ మూవీ అవుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ ఒక ముఖ్యపాత్రలో కనిపించగా, కావ్య థాపర్‌ కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇంతకీ ఈ సినిమా రవితేజకి విజయాన్ని అందించిందా లేదా చూద్దాం.

కథేంటంటే

ఢల్లీిలోని ఒక జాతీయ వార్తాపత్రికలో పనిచేసే జర్నలిస్ట్‌ నళిని రావు (అనుపమ పరమేశ్వరన్‌) అనుకోకుండా ఒక చేనేత వస్త్రాన్ని చూస్తుంది, ఆసక్తిగా అది ఎక్కడనుండి వచ్చింది, అది తయారు చేసే వ్యక్తి గురించి ఆరా తీసి ఒక చిన్న వార్తగా పత్రికలో రాస్తుంది. ఆ వార్త చూసిన ఇంటిలిజెన్స్‌, రా డిపార్టుమెంట్స్‌ రంగంలోకి దిగి ఆ పేపర్‌ ఒకరోజు ప్రింట్‌ అవకుండా అడ్డుకొని, ఆ వార్త ఎలా వచ్చింది, ఎవరు రాసారు? అని ఆరా తీస్తారు. పత్రిక యాజమాన్యం ఆ వార్త రాసిన నళినిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తారు. అప్పుడు నళినికి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగి మదనపల్లి వచ్చి అక్కడ తన పరిశోధన ప్రారంభిస్తుంది. అక్కడ వున్న పోలీసు అధికారి చెంగల్‌ రెడ్డి (మిర్చి కిరణ్‌), ఎంఎల్‌ఏ (అజయ్‌ ఘోష్‌) అతని పిఏ (శ్రీనివాస్‌ రెడ్డి) వీళ్లందరినీ అడిగితే అతని పేరు సహదేవ్‌ వర్మ (రవి తేజ) అని తెలుస్తుంది. అతను అక్కడ పత్తిని పండిరచి చేనేత కార్మికులకు అండగా వున్నాడు అని తెలుస్తోంది. అతని గురించి చాలా లోతుగా పరిశోధన మొదలుపెట్టిన నళినికి సహదేవ్‌ వర్మ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి. చిన్న కథనమే అయినా... అది ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈగల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్‌ బృందాలు, నక్సలైట్లు, తీవ్రవాదులతోపాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకీ టార్గెట్‌గా ఉంటుంది ఈగల్‌. సహదేవ్‌ వర్మ (రవితేజ) ఒక్కడే ఈగల్‌ని ఓ నెట్‌వర్క్‌లా నడుపుతుంటాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లోని ఓ పత్తి మిల్లుతోపాటు, పోలండ్‌లోనూ ఆ నెట్‌వర్క్‌ మూలాలు బహిర్గతం అవుతాయి. ఇంతకీ ఈగల్‌కీ, తలకోన అడవులకీ సంబంధం ఏమిటి?సహదేవ్‌ వర్మ ఎవరు?అతని గతమేమిటి, ఈగల్‌ నెట్‌వర్క్‌ లక్ష్యమేమిటి?ఈగల్‌ పేరుపై దొంగతనంగా సప్లై చేసే అతను.. ఇక్కడ సహదేవ్‌ వర్మగా ఎందుకున్నాడు? అతని భార్య రచన (కావ్య థాపర్‌)కి ఏమైంది? ఈ విషయాలన్నీ జర్నలిస్ట్‌ నళిని పరిశోధనలో ఎలా బయటికొచ్చాయనేది సినిమా.

ఎలా ఉందంటే

స్టైలిష్‌ యాక్షన్‌ చిత్రాల హవా కొనసాగుతున్న ఈ దశలో... పక్కాగా ఆ కొలతలతో రూపుదిద్దుకున్న మరో చిత్రమిది. నిర్ణయం నియంత నివారణ... అంటూ ఆయుధం ఎవరి చేతుల్లో ఉండాలో ఈ కథతో చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఈగల్‌, దాని నెట్‌వర్క్‌ పరిశోధనలతో కథ మొదలవుతుంది. ఆ పరిశోధనలో అసలు విషయాలు, అసలు పాత్రలు వెలుగులోకి వచ్చే వరకూ కథ అంతగా రక్తి కట్టదు. ఈగల్‌ ప్రస్తావన రాగానే భయపడే వ్యక్తులు, అసలు కథని తెలుసుకునేందుకు కథానాయిక అనుపమ చేసే రకరకాల ప్రయత్నాలతోనే  ప్రథమార్ధం సాగుతుంది. విరామ సన్నివేశాలకు ముందే అసలు కథలోకి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. విరామం తర్వాత వచ్చే యాక్షన్‌ సన్నివేశాల తర్వాత సినిమా మరింత రసవత్తరంగా మారుతుంది.ర్శకుడు ఈ సినిమాను కథలు కథలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. అది కొత్త ప్రయత్నమే కావొచ్చు కానీ, పెద్దగా ఫలితం ఇవ్వలేదు. కొన్నిచోట్ల కథనం గందరగోళంగా అనిపిస్తుంది. ఇలాంటి మైనస్‌లన్నింటినీ స్టైలిష్‌గా సాగే యాక్షన్‌ ఘట్టాలు మరిచిపోయేలా చేస్తాయి. అత్యున్నతమైన నిర్మాణ హంగులు, నాణ్యమైన విజువల్స్‌తో సినిమా మరో స్థాయికి వెళ్లింది. ద్వితీయార్ధంలో పోలండ్‌లో జరిగే కథ, పతాక సన్నివేశాల్లో సెంటిమెంట్‌, కొనసాగింపునకు కావల్సిన లీడ్‌ని ఇవ్వడం వంటి అంశాలన్నీ కూడా ఆకట్టుకుంటాయి. అమ్మవారి విగ్రహం నేపథ్యంలో యాక్షన్‌ ఘట్టం సినిమాకే హైలైట్‌.  బలమైన అంశాన్ని.. బలమైన కథతో చెప్పారు. ఆయుధాలు, పత్తి పంట నేపథ్యాల్ని  ప్రేమకథతో కనెక్ట్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. లోతైన మాటలు సినిమాకు ఆకర్షణే అయినా,  కథనంలోనే సరళత్వం లోపించింది. యాక్షన్‌ ప్రియుల్ని అలరించే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో కనిపించారు. ఆయన తెరపై రెండు కోణాల్లో కనిపిస్తారు. రెండు గెటప్పులూ బాగా నప్పాయి.

ఎవరెలా చేశారంటే

ఇక నటీనటుల విషయానికి వస్తే, రవితేజ పాత్రలో రెండు వైవిధ్యాలు కనబడతాయి. ఒకటి యంగ్‌, రెండోది మధ్యవయస్కుడి పాత్ర. అతనికి మాటలు కూడా చాలా తక్కువే వున్నాయి. రవితేజ తన పాత్ర బాగా చేశాడు, ముఖ్యంగా మధ్యవయస్కుడి పాత్ర ఆయనకు కొత్తగా ఉంది.. బాగుంది కూడా. ఇక నవదీప్‌, రవితేజతో పాటు సినిమా అంతా కనిపిస్తాడు. అనుపమ పరమేశ్వరన్‌కి ఇదేమి పెద్దగా పేరు తెచ్చే పాత్ర కాదు కానీ తన పరిధి మేరకి చేసింది. కావ్య థాపర్‌ రెండో సగంలో వస్తుంది. అజయ్‌ ఘోష్‌, శ్రీనివాస రెడ్డి, మిర్చి కిరణ్‌, శివన్నారాయణ అందరూ తమ పాత్రల పరిధి మేరకి చేశారు. మధుబాల రా చీఫ్‌గా సూట్‌ కాలేదు. అవసరాల శ్రీనివాస్‌ పాత్రని సరిగ్గా వాడుకోలేదు. ఛాయాగ్రహణం బాగుంది, నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. మాటలు బాగా రాశారు. సాంకేతికంగా... సినిమా ఉన్నతంగా ఉంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అత్యున్నత నిర్మాణ విలువలతో ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించింది. మణిబాబు కరణం మాటలు బాగున్నాయి. సంగీతం చిత్రానికి ప్రధాన బలం. డేవ్‌ జాండ్‌ నేపథ్య సంగీతం ప్రభావం చూపిస్తుంది. రవితేజ, కావ్య థాపర్‌లపై ప్రేమ పాట, చిత్రీకరణ బాగుంది. కెమెరా, ఎడిటింగ్‌ విభాగాల్నీ చూసుకున్న దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని సినిమాను స్టైలిష్‌గా తీయడంలో విజయవంతమయ్యారు. రచనలోనూ బలం ఉంది.

ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !