ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ లో రోడ్ షో నిర్వహించారు. జగన్ పాలనలో మీకు నష్టం కలిగితే టిడిపికి ఓటు వేయండని కోరారు. కడప ఎవరి సొత్తు కాదు.. కడప ఇలాఖాలో టిడిపి జండా ఎగురుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైసిపి మేమంతా సిద్దం సభ జనానికి, ఈరోజు ప్రొద్దుటూరు ప్రజాగళం మీటింగ్ జనానికి తేడా చూసుకోమన్నారు. రాయలసీమకు గుండెలాంటి కడప నుంచి జగన్‌కు సవాల్ విసిరారు చంద్రబాబు. గత ఐదేళ్ళలో రాయలసీమకు, కడపకు కనీసం పులివెందులకు ఏమన్నా చేశావా అని ప్రశ్నించారు. జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
రాయలసీమకు ఏం చేశాడు !
‘జగన్‌కు రాయలసీమ అంటే హింస, హత్యా రాజకీయాలు.. టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. రైతును రాజు చేయడం టీడీపీ సంకల్పం. పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మేది లేదంటున్నారు. విపరీతమైన మార్పు వచ్చింది.. ట్రెండ్ మారింది.. వైసీపీ బెండు తీస్తారు. వైసీపీ నేతల దాడులకు టీడీపీ కార్యకర్తలు భయపడలేదు. కడపకు స్టీల్‌ప్లాంట్ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. శంకుస్థాపనలు కాదు.. ప్రారంభోత్సవాలు జరగాలి. రాయలసీమకు మేం కియా మోటార్స్ తీసుకొచ్చాం. కరవుసీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయి. నా బ్రాండ్ కియా మోటార్స్ తేవడం.. జగన్ బ్రాండ్ వేసిన స్టీల్‌ప్లాంట్‌కు మళ్లీ శంకుస్థాపన చేయడం..! పరిశ్రమలు తేకపోగా.. ఉన్నవాటిని తరిమేశారు’’ ‘జగన్‌కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలుసా..? రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది. కోనసీమలో కొబ్బరి చెట్టే వస్తుంది కాని సీమలో అరటి , చీని పండుతుందని వివరించారు. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కల. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి. ఆ సంకల్పంతోనే 72 శాతం పనులు పూర్తి చేశాం. ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా..? రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది. క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ నినాదం కావాలి. ఈ అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్ళు నేను అధికారంలో ఉండి ఉంటే బనగాన పల్లికి కృష్ణ నీరు తెచ్చే వాడినన్నారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి జగన్‌కు లేదన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కువైపోయాయన్నారు. వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చిన 100రోజులలో గంజాయి అమ్మేవాడిని భూమిపై ఉంచనని తెలిపారు. హైటెక్ సిటీని అవుటర్ రింగ్ రోడ్డుని ఎయిర్ పోర్ట్‌ని నిర్మించి దేశంలోనే అగ్రగామి సిటీగా హైదరాబాద్ తయారు చేశానని చెప్పారు. తనది విజన్ అయితే జగన్ ది పాయిజన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు హామీలు..
ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ. 1500 చొప్పున ఇస్తానన్నారు. తల్లికి వందనం పేరుతో రూ. 15000 చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారు. దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తానంటున్నారు. ప్రతి ఒక్క రైతుకు ఏడాదికి రూ. 20వేల రూపాయలు.. బిందు సేద్యానికి నిధులు కేటాయిస్తానన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ. 3000 ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. వర్క్ ఫ్రం హోం కింద ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తానని తెలిపారు. ఇంటింటికి నీటిని అందించడమే కాకుండా వృద్దాప్య పెన్షన్ రూ.4000 ఇస్తాను అన్నారు.