పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ టానిక్ వైన్‌షాప్‌లలో అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పన్నుకు సంబంధించిన పత్రాలను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పరిశీలించారు. మొత్తం 11 స్టోర్‌లలో తనిఖీలు చేశారు. ఐదేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ టానిక్ లిక్కర్ మాల్స్ వ్యాపారం.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో చక్కగా సాగింది.. 11 బ్రాంచీల వరకు విస్తరించింది.
ఏ4 ఎలైట్ క్రింద లైసెన్స్
టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు చేపట్టారు. వాటి అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టానిక్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్‌కు మాత్రమే అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీ కి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్‌షాప్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో టానిక్‌కు 11 ఫ్రాంచైజ్‌లుఉండగా, క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఏ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు టానిక్‌కు ఉన్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించారు. టానిక్ గ్రూప్‌లో జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్‌లు నడిపినట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎంవో అధికారి కుమారుడు, ఎక్స్ జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు.