ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం ఉత్తీర్ణత శాతం వచ్చింది.సెకండ్ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. రెండో స్థానం గుంటూరు. మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్‌లో 10.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక, మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను http://resultsbie.ap.gov.in/ చూడవచ్చు
ఉత్తీర్ణతా శాతం ఎంతంటే...
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరవగా.. 3,10,875 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలు 67%. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 78. ఒకేషనల్ కోర్స్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 38,483 మంది హాజరవగా.. 23,181 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ పరీక్షకు 32,339 మంది విద్యార్థులు హాజరవగా.. 23,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,17,570 మంది విద్యార్థులు , సెకండియర్ పరీక్షలకు 5.35,865 మంది విద్యార్థులు హాజరు కాగా ఇంటర్ మొదటి, రెండు తరగతుల నుండి మొత్తం 10,53,435 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సంవత్సరం పరీక్ష పేపర్లు లీక్ కాకుండా సరికొత్త టెక్నాలజీని వాడినట్లు తెలిపారు. ప్రతి పేపర్‌కి సీరియల్ నంబర్లు ఇచ్చి పేపరు లీక్ కాకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించింది ఇంటర్మీడియట్ విద్యామండలి.
బాలికలదే పైచేయి..
ఈసారి ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారని ప్రకటించారు పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలకు ఈ ఫలితాల వల్ల ఫ్యూచర్ ప్రభావితం కాదన్నారు. తల్లిదండ్రులు ఫలితాలు ఎలా ఉన్నా పిల్లలకు మద్దతుగా ఉండాలని సూచించారు. లైఫ్.. పరీక్ష కన్నా చాలా గొప్పదని పేర్కొన్నారాయన. ఫెయిల్ అని విద్యార్థులకు వెంటనే సప్లై ఉంటుందని, పిల్లలకు మరో అవకాశం ఉంటుందన్నారు. సప్లమెంటరీ, మెయిన్ ఎగ్జామ్స్‌కు ఎలాంటి తేడాలు ఉండవన్నారు. రెండు పరీక్షలకు తేడా ఎవ్వరూ చూపించరన్నారు.