Sharmila : కడప పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నా, అవినాష్‌ని ఓడిరచటమే నా లక్ష్యం !

0

ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల తాజాగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన అనంతరం ఇడుపులపాయలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నా. నేను తీసుకున్న ఈ నిర్ణయం అంత సులువైంది కాదని తెలుసు. నేను పోటీలో ఉంటే మా కుటుంబం నిట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నా. గత ఎన్నికల ముందు షర్మిల నా చెల్లెలు కాదు.. నా బిడ్డ అని జగన్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను పూర్తిగా విస్మరించారు. నా అనుకున్న వాళ్లను జగన్‌ నాశనం చేశారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు. మా చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను జగన్‌ వెనకేసుకొస్తున్నారు. హంతకులు తప్పించుకొని తిరుగుతున్నా శిక్ష పడకుండా జగన్‌ వారిని కాపాడుతున్నారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్‌రెడ్డికి జగన్‌ వైసీపీ టికెట్‌ ఇవ్వడం తట్టుకోలేక పోయా.

జగన్‌పై ద్వేషం లేదు.

జగన్‌ మోహన్‌ రెడ్డి తన అన్న అని, ఆయనంటే తనకు ద్వేషం లేదన్నారు. కాకపోతే ఇప్పుడున్న జగన్‌ తనకు పరిచయం లేడని బాంబ్‌ పేల్చారు. వివేకాను హత్య చేసిన వారికే కడపలో ఎంపీ అభ్యర్థిగా సీట్‌ ఇచ్చాడని, ఇది తెలిసి తాను తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన వాళ్లకు శిక్ష విధించలేదని.. చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు తప్పించుకొని తిరుగుతున్నారని ఉద్ఘాటించారు. అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అధికారం వాడుకొని, జగనే వాళ్లని రక్షిస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. అవినాష్‌ రెడ్డిని వెనకేసుకు వస్తున్నాడని, మళ్లీ అతనికే సీట్‌ ఇచ్చాడని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని, వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని, ఈ విషయం తమకు చాలా ఆలస్యంగా అర్థం అయ్యిందని పేర్కొన్నారు. సాక్షి ఛానెల్‌ తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకా బాబాయ్‌ చివరి కోరిక !

గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయ కోసం వాడుకుంది. హత్య చేయించిన వారికి టికెట్‌ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసినా అతనికే టికెట్‌ ఇచ్చారు. వివేకా చివరి కోరిక నేను కడప ఎంపీగా పోటీ చేయాలి. ఆయన కోరిక నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నా. సునీత కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతోంది. హంతకుడైన అవినాష్‌రెడ్డిని చట్ట సభలో అడుగుపెట్టకుండా చేయడమే నా లక్ష్యం. కడపలో అతను గెలవకూడదు అంటే నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరారు. షర్మిల రాజకీయ ప్రవేశ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆమె తల్లి విజయమ్మ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కన్నీటితో ప్రార్థన చేశారు. తమ కుటుంబానికి వచ్చిన ఈ పరీక్షలో నెగ్గేలా చేయమని ప్రార్థించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !