Pocharam Srinivas Reddy : పార్టీ మారిన పోచారం !

0

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం, ఆయన కాంగ్రెస్‌ పార్టీ చేరారు. కాగా,పోచారం ఇంటికి రేవంత్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ వెళ్లారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం, రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించడంతో పోచారం ఓకే చెప్పారు. ఆ తర్వాత పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్‌ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ..

 రైతులకు పోచారం అండగా నిలిచారు. పోచారం సలహాతో రైతులకు మేలు జరుగుతుందని ఆయనను కలిశాను. మాను అండగా నిలవాలని కోరాము. ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. వ్యవసాయం దండగ కాదని.. పండగ చేసే బాధ్యత తమదని చెప్పారు. రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి మద్దతు తీసుకుని ముందుకెళ్తామన్నారు. పార్టీలో శ్రీనివాస రెడ్డికి తగిన గౌరవం ఇస్తాం. తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు అని కామెంట్స్‌ చేశారు.

మాజీ స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ.. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని.. సీఎం రేవంత్‌ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించానని పోచారం తెలిపారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. తాను రైతుబిడ్డనని.. అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్లు వివరించారు. ‘‘సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్‌ ధైర్యంగా ముందుకెళ్తున్నారు. నా జీవితంలో ఆశించేది రైతు సంక్షేమం తప్ప ఇంకేమీ లేదు. గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశాను. అందరి సహకారంతో రాష్ట్ర భవిష్యత్‌ కోసం పనిచేస్తాం. నా రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్‌తో. ఆ తర్వాత టీడీపీ, బీఆర్‌ఎస్‌లో పనిచేశాను. రేవంత్‌ చేపడుతున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే కాంగ్రెస్‌లో చేరాను. 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓపిక ఆయనకు ఉంది. మాకు వయసైపోయింది.. పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలి’’ అని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

మరోవైపు.. మాజీ స్పీకర్‌ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్‌కు నివాసం వద్దకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, పార్టీ శ్రేణులు చేరుకున్నారు. పోచారం కాంగ్రెస్‌ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్‌ కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్‌ నెలకొంది. బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !