వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన.. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.. అని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం తన రాజ్యసభ పదవితో పాటు వైఎస్‌ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అంతేగాక ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని, తనపై ఎవరి ఒత్తిడి లేదని అన్నారు.
జగన్‌తో పొసగకనే విజయసాయిరెడ్డి వైసీపీని వీడారా?
తాను ఇకపై ఏ పార్టీలో చేరనని, వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్సీపీ నేతల రాజీనామాలపై గురువారం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మా రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురు. రాజకీయాల్లో ఉన్నపుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలి. మనంతట మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో రాజీపడి అటువైపు పోతే మన వ్యక్తిత్వం, విలువ, విశ్వసనీయత ఏంటి? సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతే, వైఎస్‌ఆర్సీపీ ఈ రోజు ఉందీ అంటే వారి వల్ల కాదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే ఉంది’’ అని అన్నారు. జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో జగన్ మోహన్ రెడ్డితో పొసగకనే విజయసాయిరెడ్డి వైసీపీని వీడారా? అని వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. జగన్ కు, ఆయన కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్న విజయసాయి రెడ్డి పార్టీని వీడటం, విజయసాయి రెడ్డి, శర్మిలతో భేటీ అయ్యారని వార్తలు రావడం, కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ట్వీట్లు వేయడం, ఇప్పుడు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం.. ఇవన్నీ చూస్తుంటే, ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.